వర్ష బీభత్సం: గాలులకు కూలిన చెట్లు, స్తంభాలు, పలు ప్రాంతాలు జలమయం

<< Back

హైదరాబాద్‌: నగరంలో గురువారం అర్ధ రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం పడింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో బీభత్సం సృష్టించింది. గత కొంత కాలంగా భానుడు ప్రతాపానికి అల్లాడిపోయిన ప్రజలు వాతావరణ ఒక్కసారిగా చల్లబడటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఈదురుగాలులకు పలుచోట్ల కరెంటు స్తంభాలు, చెట్లు, హోర్డింగులు కూలిపోయాయి. గురువారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మియాపూర్‌, మాదాపూర్‌, రాయదుర్గం, గచ్చిబౌలి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, సచివాలయం-ఇందిరాపార్కు మార్గంలో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ప్రభుత్వ ముద్రణా కార్యాలయం వద్ద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది.

ముషీరాబాద్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, పార్శిగుట్ట, చిలకలగూడ, అడ్డగుట్ట బేగంపేట, బోయిన్‌పల్లి, ఆల్వాల్‌, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

రామంతాపూర్‌ చర్చి కాలనీ, కవాడిగూడ డీఎస్‌ నగర్‌ ఇళ్లలోకి మురుగునీరు వచ్చిన చేరటంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఉపరితల ద్రోణి కారణంగా వర్షాలు పడుతున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు మూడు రోజులపాటు చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

Related News