రికార్డ్: ఇన్నింగ్స్‌లో 10వికెట్లు పడగొట్టిన కేరళ కుర్రాడు!

<< Back

తిరువనంతపురం: కేరళలోని కనూర్‌కు చెందిన 18ఏళ్ల యువ బౌలర్ అరుదైన రికార్డును నమోదు చేశాడు. జూనియర్ ఇంటర్ జిల్లా టోర్నమెంటులో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి ఈ ఘనతను సాధించాడు.

దీంతో పెరింతల్మన్నాలోని కేసీఏ స్టేడియంలో రెండు రోజులపాటు జరిగిన అండర్-19 టోర్నీలో నజిల్ సిటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇతడు 10 వికెట్లు ఏకధాటిగా పడగొట్టడంతో కనూర్ విజయానికి బాటలు పడ్డాయి. అంతేగాక, ప్రత్యర్థి జట్టైన మలప్పురం 26 పరుగులకే తన తొలి ఇన్నింగ్స్ ముగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇటీవలే ఇంటర్మీడియట్ ముగించిన నజిల్.. ఈ మ్యాచ్‌లో 9.4-2-12-10 నమోదు చేశాడు. పడగొట్టిన 10 వికెట్లలో 4 బౌల్డ్‌లు కాగా, మూడు ఎల్బీడబ్ల్యూలు. తాను టీమిండియా ఆటగాడు భువనేశ్వర్ కుమార్‌లా స్వింగ్ బౌలర్ కావాలని కోరుకుంటున్నట్లు నజిల్ మీడియాతో చెప్పాడు.

తాను ఇన్‌స్వింగ్ బౌలర్‌నని, పేస్ లోనే బంతిని పూర్తిగా తిప్పేయగలనని తెలిపాడు. కాగా, నజిల్ కుటుంబం క్రికెట్ నేపథ్యం ఉన్నదే. నజిల్ అంకుల్ ఫబిద్ ఫరూక్ కేరళ చివరి సీజన్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ జట్టులో ఆడాడు.

ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్ 1956లో జరిగిన 4వ యాషెస్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి తొలిసారి ఈ ఘనతను నమోదు చేశాడు. ఆ తర్వాత భారత బౌలర్ అనిల్ కుంబ్లే 1999లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు.

Related News