సచిన్ ఓకే చెప్పారు: రియో వివాదం సద్దు మణిగినట్టే..!

<< Back

ముంబై: రియో ఒలింపిక్స్‌కు భారత బృందం తరుపున గుడ్‌విల్ అంబాసిడర్‌గా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎంపికయ్యారు. రియో ఒలింపిక్స్‌లో భారత బృందానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉంటాలంటూ ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ) చేసిన విజ్ఞప్తిని సచిన్ టెండూల్కర్ అంగీకరించారు.

ఐఓఏ విజ్ఞప్తిని సచిన్ అంగీకరించడాన్ని ఆయ‌న అభిమానులు పండుగ చేసుకున్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌, షూటర్ అభినవ్ బింద్రాలు ఇప్పటికే గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. రియో ఒలింపిక్స్‌కు భారత జట్టుకు గుడ్ విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఐఓఏ నియమించిన సంగతి తెలిసిందే.

సల్మాన్ నియామకంపై భారత క్రీడా దిగ్గజం, లెజండరీ స్ప్రింటర్‌ మిల్ఖాసింగ్‌ తప్పబట్టారు. ఆ తర్వాత ఒలింపిక్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా క్రీడారంగానికి చెందిన వ్యక్తిని నియమిస్తే బాగుండేదని అభిప్రాయపడటంతో షూటర్ అభినవ్ బింద్రాని గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఐఓఏ ఎంపిక చేసింది.

ఆ తర్వాత రియోలో జరగనున్న ఒలింపిక్స్‌కు భారత బృందానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కోరింది. ఈ మేరకు ఐఓఏ సచిన్‌కు ఓ లేఖ రాసింది. ఈ లేఖకు సచిన్ టెండూల్కర్ మంగళవారం అంగీకరించారు.

రెజర్ల్ యోగేశ్వర్ దత్ కూడా సల్మాన్ నియామకాన్ని తప్పుబట్టాడు. గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమంచడానికి సల్మాన్‌కు ఉన్న అర్హతలేమిటని, క్రీడలకు ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. రియో ఒలింపిక్స్‌లో భారత బృందానికి అంబాసిడర్‌గా సల్మాన్‌ నియామకాన్ని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ సమర్థించాడు.

ఇలా రియో ఒలింపిక్స్‌కు వెళ్లడానికి ముందే ఒలింపిక్ మాజీ విజేతలు గుడ్‌విల్ అంబాసిడర్ విషయంలో పెద్ద ఎత్తున చర్చకు తెరతీశారు. మన క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని అక్కడ ప్రదర్శించి భారత్‌కు ఎన్ని పతకాలు తీసుకొచ్చారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Related News