ఏమంటారో?: ఒలింపిక్స్ అంబాసిడర్‌గా సచిన్‌కి పిలుపు

<< Back

న్యూఢిల్లీ: ఈ ఏడాది రియోలో జరగనున్న ఒలింపిక్స్‌కు భారత బృందానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కోరింది. ఈ మేరకు ఐఓఏ సచిన్‌కు ఓ లేఖ రాసింది. కాగా ఐఓఏ అభ్యర్థనపై సచిన్ ఇంకా స్పందించాల్సి ఉంది.

సచిన్ టెండూల్కర్ స్పందన కోసం ఐఓఏతో పాటు ఆయ‌న అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీనిపై స‌చిన్ నుంచి సానుకూల స్పంద‌నే వ‌స్తుంద‌ని అందరూ భావిస్తున్నారు. మరోవైపు స‌చిన్‌తో పాటు ఆస్కార్ అవార్డు విజేత, భార‌త సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్‌ను కూడా భార‌త్ నుంచి బ్రాండ్ అంబాసిడ‌ర్‌ల టీమ్‌లో చేర్చాల‌ని ఐఓఏ భావిస్తోంది.

బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వ్యవహరించడం వల్ల భారత అథ్లెట్లలో మరింత ఆత్మవిశ్వాసం ఏర్పడుతుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో ఆగ‌స్టు 5 నుంచి 21వ తేదీ వ‌ర‌కు ఒలింపిక్స్ పోటీలను నిర్వ‌హించ‌నున్నారు.

రియో ఒలింపిక్స్‌కు భారత జట్టుకు గుడ్ విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఐఓఏ నియమించిన సంగతి తెలిసిందే. సల్మాన్ నియామకంపై భారత క్రీడా దిగ్గజం, లెజండరీ స్ప్రింటర్‌ మిల్ఖాసింగ్‌ తప్పబట్టారు. ఒలింపిక్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా క్రీడారంగానికి చెందిన వ్యక్తిని నియమిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

ఇది అవాంఛిత నియామకం అని, దీనిని వెంటనే మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే సల్మాన్‌ ఖాన్‌కు వ్యక్తిగతంగా తాను వ్యతిరేకంగా కాదని, కానీ క్రీడల దృష్ట్యా ఆయనను తొలగించాలని సూచించారు. మరోవైపు రెజర్ల్ యోగేశ్వర్ దత్ కూడా సల్మాన్ నియామకాన్ని తప్పుబట్టాడు.

గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమంచడానికి సల్మాన్‌కు ఉన్న అర్హతలేమిటని, క్రీడలకు ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. రియో ఒలింపిక్స్‌లో భారత బృందానికి అంబాసిడర్‌గా సల్మాన్‌ నియామకాన్ని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ సమర్థించాడు.

''సల్మాన్‌ ప్రముఖ నటుడు. రియో ఒలింపిక్స్‌కు అతడు మరింత ఆకర్షణ తెస్తాడనడంలో సందేహం లేదు. దేశానికి గర్వకారణంగా నిలిచిన అసాధారణ ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. సల్మాన్‌లానే మరికొందరినీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తే మంచిదే. ఒక్కరినే ఎంపిక చేయాలని ఎక్కడా లేదు. క్రీడలకు ఆకర్షణ ఎంతో అవసరం. క్రీడాకారులతో పాటు సినీ నటుల భాగస్వామ్యం వల్ల ఐపీఎల్‌, ఐఎస్‌ఎల్‌లు విజయవంతమయ్యాయి'' అని గంగూలీ అన్నాడు.

Related News