అవినీతి 'డీటీఓ' ఆస్తి వంద కోట్లా?: ఎందుకిలా, ప్రభుత్వ ఉద్యోగులు మారరా?

<< Back

కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా మరో అవినీతి తిమింగళం ఏసీబీ అధికారుల చేతికి చిక్కింది. రవాణాశాఖలో ఉపకమిషనర్ (డీటీఓ)గా పనిచేస్తున్న ఆయన ఆస్తుల విలువ వంద కోట్లకు పైబడే. వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా ఆర్టీఓగా విధులు నిర్వహిస్తున్న ఆదిమూలం మోహన్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై కాకినాడలోని ఆయన ఇంటితో సహా ఏపీ, తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 9 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేశారు.

భారీగా నగదు, బంగారం, వెండి వస్తువులు, ప్లాట్లు, అపార్టుమెంట్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు మోహన్‌కు హైదరాబాద్ కొంపల్లిలో 8 ప్లాట్లు, మాదాపూర్‌లో 4 ప్లాట్లు, జూబ్లీహిల్స్‌లో 699 గజాల్లో 4 అంతస్తుల అపార్టుమెంట్, విజయవాడలో కుమార్తె పేరుతో ఒక ఇల్లు, అల్లుడి పేరుతో మరో రెండు ఇళ్లు, చిత్తూరులో 9 ఎకరాల భూమి, ప్రకాశం జిల్లాలో 45 ఎకరాల భూమి, ఇవి కాక చిత్తూరు, నెల్లూరు, హైదరాబాద్, బళ్లారిలో పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.

ఇప్పటి వరకు అధికారులు గుర్తించిన ఆస్తుల విలువ మార్కెట్ విలువ ప్రకారం రూ.32 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు ఉన్నాయి. అయితే వాస్తవానికి ఇవి రూ.100 నుంచి రూ.150 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కుమార్తె పేరుతో హైదరాబాద్‌లో ఐదు పరిశ్రమలు ఉన్నట్టు పత్రాలు ఉన్నాయని, వీటికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో స్థలాలున్నా ఎటువంటి ఫ్యాక్టరీలు లేవని, ఇవి కేవలం నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చుకునేందుకే రూపొందించినవిగా అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది.

ఆర్టీఓ మోహన్‌ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ముందుగా ప్రాథమిక విచారణ నిర్వహించారు. అనంతరం ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ ఎం.మాలకొండయ్య ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం నుంచి డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది గురువారం జిల్లాలో తనిఖీలు చేపట్టారు.

రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు, అధికారులు ఏసీబీ అధికారులు హైదరాబాద్, విజయవాడ, కడప, ప్రొద్దుటూరు, బళ్లారి, అనంతపురం, కాకినాడ, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు. సోదాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశాలున్నట్టు ఏసీబీ డీఎస్పీ ఎ.రమాదేవి తెలిపారు.

ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో బయటపడిన అక్రమాస్తులు ఈ శాఖలో అవినీతి ఏస్థాయిలో ఉందో వెల్లడిస్తోంది. అడ్డదారుల్లో కూడబెట్టిన అవినీతి సొమ్మును పలు కంపెనీల్లో పెట్టుబడులుగా మార్చుకుంటున్నారు. నిబంధనల పేరుతో చేపట్టిన బలవంతపు వసూళ్లు హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో స్థిరాస్తులుగా మారుతున్నాయి.

చేయి తడిపితేనే గాని బండి కదపలేని పరిస్థితులు జిల్లా రవాణా శాఖలో నెలకొన్నాయి. అవినీతి అధికారులకు కొందరు నాయకులు కాస్తుండడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. దేశంలో ఎక్కువ అవినీతిమయమైన శాఖల్లో రవాణాశాక ఒకటని స్వయంగా కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒకానొక సందర్భంలో చెప్పడం విశేషం.

అవినీతి నుంచి ఈ శాఖను ప్రక్షాళన చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదేమో? ఏపీ రవాణాశాఖలో అవినీతి తగ్గిద్దామని ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది.

Related News