మోహన్ బాబు ఉత్సాహం: విష్ణు, రాజ్ తరణ్ గుండమ్మ కథలో నటిస్తే...

<< Back

హైదరాబాద్: మంచు విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్‌లో ఈడో రకం ఆడో రకం సినిమా హిట్ కావడంతో మోహన్ బాబు ఉత్సాహంగా ఉన్నారు. వారిద్దరితో కలిసి గుండమ్మకథను రీమేక్ చేయాలని ఉత్సాహపడుతున్నారు. ఆ సినిమా హక్కులు ఎవరి వద్దనైనా ఉంటే వాటిని కొని రీమేక్ చేయాలని ఉందని ప్రకటించారు.

'ఈడోరకం ఆడోరకం' విజయోత్సవ సభకు ఆయన అతిథిగా హాజరయ్యారు. మంచు విష్ణు, రాజ్‌ తరుణ్‌ కథానాయకులుగా నటించిన చిత్రం 'ఈడోరకం ఆడోరకం' సినిమా. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. మోహన్‌బాబు మాట్లాడుతూ - విష్ణు, రాజ్‌తరుణ్‌ ఈ చిత్రంలో చక్కగా నటించారని, జి.నాగేశ్వరెడ్డి బాగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. అందుకే గుండమ్మ కథ తెరకెక్కిస్తే ఆయన చేతిలోనే పెడతానని చెప్పారు.

గుండమ్మకథ సినిమాలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు నటించారు. అప్పట్లో సినిమా అనూహ్యమైన ఘన విజయం సాధించింది. ఈ సినిమా రీమేక్‌పై ఎప్పటికప్పుడు ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా గుండమ్మకథ నిర్మిస్తే నటించేందుకు గతంలో ఉత్సాహం కనబరిచాడు.

ఈడో రకం ఆడో రకం సినిమా విజయోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి నారాయణరావు మాట్లాడుతూ కథానాయకుల్ని కాదు, కథను నమ్మి సినిమాలు చేయాలని, అప్పుడే విజయాలు దక్కుతాయని చెప్పారు. ఒకట్రెండు విజయాలు రాగానే పారితోషికం పెంచి నిర్మాతల్ని ఇబ్బంది పెట్టకూడదని, ఈ విషయం ఈతరం కథానాయకులందరినీ కూర్చోబెట్టి చెప్పాలని ఉందని అన్నారు.

వినోదాత్మక చిత్రాలకు విజయం తప్పకుండా లభిస్తుందని, నవ్వించే సినిమాలు తక్కువైపోయాయని ఆయన అన్నారు. అలాంటి చిత్రాలొస్తే తప్పకుండా ఆదరిస్తారని, ఆ నమ్మకంతో చేసిన ప్రయత్నమిదని దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి అన్నారు.

ఈ విజయాన్ని అమ్మానాన్నలకు అంకితం ఇస్తున్నట్టు తెలిపారు విష్ణు. రాజేంద్రప్రసాద్‌తో కలసి నటించడం మర్చిపోలేని అనుభవమని రాజ్‌ తరుణ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అనిల్‌ సుంకర, రాజేంద్ర ప్రసాద్‌, పోసాని, హెబ్బాపటేల్‌, సాయికార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Related News