కేసీఆర్ స్ట్రాటజీ ఏంటీ?: తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు

<< Back

హైదరాబాద్: పాలనలో వేగం పెంచడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గంలోని పలువురు మంత్రుల శాఖల మార్పుపై కేసీఆర్ ఆదివారం తుది కసరత్తు చేశారు. మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలకు తెర దించుతూ కేవలం నాలుగు శాఖల్లోనే మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఉన్న శాఖలతో పాటు మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాసయాదవ్, జోగు రామన్న ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖల్లో మార్పుచేర్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రస్తుతం కేసీఆర్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు.

ఈ ప్రాజెక్టును ఏ పరిస్థితుల్లోనూ నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి దానిని పంచాయతీరాజ్ శాఖ నుంచి విడదీసి తన చేతిలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే కొత్తగా మిషన్ భగీరథకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయనున్నారు.

ఈ శాఖ తన చేతిలో ఉంటేనే అధికారులతో నిత్యం టచ్‌లో ఉంటూ మిషన్ భగీరథను త్వరగా పూర్తి చేయొచ్చనే ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని అయిదేళ్లలో పూర్తి చేస్తామని లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోనని సీఎం పలుమార్లు ఉద్ఘాటించిన సంగతి తెలిసిందే.

అందుకే ఈ పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 'తాగునీటి సరఫరా శాఖ'ను ఏర్పాటు చేసి సారథ్యం వహించాలని నిర్ణయించారు. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకాలు, కొత్త దవాఖానల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలను సర్కారు ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది.

వీటన్నింటికీ కావాల్సిన నిధులు వాణిజ్య పన్నుల ద్వారానే సమకూర్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహించి, పకడ్బందీగా రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచడానికి, పన్ను వసూళ్లను నూటికి నూరు శాతం రాబట్టే ఆలోచనతో వాణిజ్య పన్నుల శాఖను చేపట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది

ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖను సీఎం స్వయంగా చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ శాఖకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన దగ్గరున్న సినిమాటోగ్రఫీ శాఖను యథాతథంగా ఉంచాలని, అదే సమయంలో బీసీ వర్గాలతో ఆయనకున్న అనుబంధాన్ని వినియోగించుకునేందుకు అదనంగా బీసీ సంక్షేమ శాఖను అప్పగించనున్నారు.

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు మున్సిపల్, ఐటీ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌కు కొత్తగా పరిశ్రమల శాఖను కట్టబెట్టాలని సీఎం నిర్ణయించారు. పరిశ్రమలు, ఐటీ శాఖలు పట్టణాలు, నగరాల అభివృద్ధితో ముడిపడి ఉన్న అంశాలు కావటంతో ఇవన్నీ ఒకే మంత్రి దగ్గర ఉంచితే మంచిఫలితం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం పరిశ్రమల శాఖకు జూపల్లి కృష్ణారావు సారథ్యం వహిస్తున్నారు. తాజా మార్పుల్లో మంత్రి కేటీఆర్ దగ్గరున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను జూపల్లికి అప్పగించనున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగిన నాయకుడు కావటం, గ్రామాలపై పట్టు ఉండటంతో పరిశ్రమలకు బదులుగా ఈ శాఖను జూపల్లికి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు:

* ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద మిషన్ భగీరథ, వాణిజ్య పన్నుల శాఖలు

* తలసానిని వాణిజ్య పన్నుల శాఖ నుంచి బీసీ సంక్షేమ శాఖకు మార్పు, సినిమాటోగ్రఫీ శాఖను యథాతథంగా ఉంచారు.

* కేటీఆర్‌కు ఐటీ శాఖతో పాటు పరిశ్రమల శాఖ అదనం * జూపల్లి పరిశ్రమల శాఖ నుంచి పంచాయితీ శాఖకు మార్పు

* జోగు రామన్న వద్ద ఉన్న రెండు శాఖల్లో బీసీ సంక్షేమ శాఖ తొలగింపు

Related News