మోడీ మార్ఫింగ్ ఫోటో: టీఎంసీ ఇంగిత జ్ఞానం ఏమైంది?

<< Back

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ కొత్తగా ఫోటో రాజకీయానికి తెరలేపింది. మార్ఫింగ్ ఫోటోలతో రాజకీయ లభ్ది పొందేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. వివరాల్లోకి వెళితే తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ డిరెక్ ఒబ్రియన్‌ శనివారం అత్యవసరంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు.

ఈ మీడియా సమావేశంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ సీపీఎం అగ్రనేత ప్రకాశ్‌ కారత్‌కు మిఠాయి తినిపిస్తున్నట్టు ఉన్న ఓ ఫొటోను విలేకరులకు విడుదల చేశాడు. అంతేకాదు సిద్ధాంత పరంగా ఎంతో వైరుధ్యమున్న బీజేపీ-సీపీఎం చేతులు కలిపాయనడానికి ఈ ఫొటో నిదర్శనమంటూ పెద్ద ఉపన్యాసం ఇచ్చారు.

అయితే ఈ పోటో నిజైమన ఫోటోనా? లేక మార్ఫింగ్ చేసిన ఫోటోనా? అనేది మాత్రం చూసుకోలేదు. ఇక్కడే అయన పప్పులో కాలేశారు. ఈ ఫోటోపై బీజేపీ వెంటనే స్పందించింది. ఆ ఫోటో ఫొటోషాపింగ్ ద్వారా మార్ఫింగ్ చేసిన ఫొటో అని మీడియా సమావేశం పెట్టి మరీ వివరణ ఇచ్చారు.

అంతేకాదు నిజానిజాలు తెలుసుకోకుండానే తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వేళ నకిలీ ఫొటోలను విడుదల చేసి రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నదని బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ మండిపడ్డారు. 2013లో ప్రధాని నరేంద్ర మోడీకి రాజ్‌నాథ్ సింగ్ స్వీట్ తినిపిస్తున్న ఫొటోను మార్ఫింగ్ చేసి తృణమూల్ బెంగాల్ ఎన్నికల్లో కొత్త నాటకానికి తెరలేపిందని ధ్వజమెత్తారు.

మరోవైపు ఈ ఫోటోపై సీపీఎం అగ్రనేత కరత్‌ కూడా స్పందించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రాజ్‌నాథ్‌‌ను తాను కలువనే లేదని స్పష్టం చేశారు. దీంతో నాలుక కరుచుకున్న డిరెక్ ఒబ్రియన్‌ క్షమాపణ చెప్పారు. తమ రీసెర్చ్ టీమ్‌ సరిగ్గా పరిశీలించకుండానే ఈ ఫొటోను ఇచ్చిందని, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని వివరణ ఇచ్చారు.

Related News